నేనొక నవకిసలయాన్ని...

 

ఒక చిరునవ్వు,

ఒక ఉదయాన్ని శాసిస్తుంది

ఒక జీవితాన్ని నడిపిస్తుంది.

ఒక ప్రాణాన్ని బ్రతికిస్తుంది.

ఒక ఉదయాన్ని శ్వాసిస్తుంది

ఒక ఉదయం,

చిరునవ్వును స్వాగతిస్తుంది

జీవితపుటాశలను బ్రతికిస్తుంది

ప్రాణాల ఉనికిని నడిపిస్తుంది

ఒక చిరునవ్వును శ్వాసిస్తుంది

నాకెన్నో ఉదయాలున్నాయి

అన్నే అస్తమయాలూను.

ఒక చిరునవ్వు నవ్వడానికి

జీవితాన్ని గాఢాలింగనం చేసుకోడానికి

ప్రాణాన్ని బ్రతుకు నిండుగా శ్వాసించడానికి

ఉదయపు పుష్యరాగాలను

సాయంసంధ్యా పగడపు దీవులుగా

మలచుకోడానికి...

నాకింకా

ఎన్నో వేకువ కువకువలట్లే ఉన్నాయి

ప్రకటిత పాండుర సాంధ్యరాగాలుగా...

ఎన్నో ఉషస్సులట్లే ఉన్నాయి

నిజనీరవ నీలిమధురిమ నిశీధ గమకాలై..

ఎన్నో ప్రభాతాలట్లే ఉన్నాయి

మేలి మనోహర గీతాలై.

ఎన్నో వెన్నెలలట్లే ఉన్నాయి

మరుజనిత విరహరావాల గానాలై..

ఒక రోజును కాలాంతమంతా జీవించడానికి

ఒక జీవితకాలాన్ని ఒక్క రోజులోనే జీవించడానికి..

నేనిప్పుడు ప్రభవించిన కవిని

నేనెప్పుడూ ప్రభవించే రవిని...

నేను కాలం ప్రసవించిన గవినిని

నా పయనం నానాటికీ నవీనం

నా ప్రభవం నవీన పయనం..

నేనొక నవకిసలయాన్ని...

 

పరాశ్రీ.... 06032023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల