నేనిప్పుడు స్థాణువును....

 

అనంతత్వం నుండి అనురాగసుధాధారొకటి అశోకామృత తరంగమై

ఆనంద పధంలో ప్రసరించి,

అలా అలా అనన్య సామాన్యమై, అచంచలమై, చేతనమై

అనంతమై నన్ను చేరింది.

ఉత్తర క్షణంలో తన్ను తాను నాలో కలిపి నాలా తనైపోయింది

ఆ మరుక్షణం అహేతుకంగానే నేను నేనై పోయాను.

ఆ మలి క్షణం అనంతోత్సాహంతో నేను నన్నిలా మరిచి

తనలా తనలో కలిసితానై పోయాను.

ఆ పవనమై, ప్రవాహమై, ఈ విశాల విశ్వంభరనై,

అనురాగాన్నై, సుధనై, ధారనై,

అలా అలా ప్రసరించి, ప్రవహించి.. నన్ననే,

నేననే, .. నన్ను నేను కోల్పోయి ఈ విశ్వాన్నైపోయాను.

అలా అలా సాగిపోయి అనంతాన్నైపోయాను,...

నేను నేనై పోయాను.. నాలో కలిసి నాలా మారి

నేననే ఉనికి మరిచి .. నేనే ఉనికినైపోయాను

ఇప్పుడు నేను లేను.. అనంతమొకటే అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంది...,

నాలో నిశ్శబ్ధంగా, ఏకాంతంగా .. నేనిప్పుడు స్థాణువును....

 

పరాశ్రీ .. 04062013

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

క్షణక్షణమూ కాలం..,

వేణుగానలోల వేణుగోపాల

నేనొక నవకిసలయాన్ని...