ఇది మామూలు జెండా కాదు!
ఇది మామూలు జెండా కాదు!
ఏదో ఒక కర్ర ముక్కకు
కట్టిన
నాలుగు పలకల గుడ్డముక్క
అసలే కాదు!
నాలుగు రంగుల్లో మిలమిల
మెరిసే
రంగుల స్వప్నం కానే కాదు.!
అది కాషాయం అనుకుంటున్నారా? కాదు.
వందేమాతరం అన్నందుకు
పగిలిన చర్మం చిందించిన నెత్తుటి జీర.!
అది పసిమి పచ్చదనం
అనుకున్నారా? కాదు.
భారత మాతా కీ జై అన్నందుకు
తగిలిన కొరడా దెబ్బల అహంకార ముద్ర.!
అది తెల్లని తెలుపు అనుకుంటున్నార? కాదు.
స్వాతంత్య్ర సాధనకు సర్వం
ధారపోసిన మహనీయుల త్యాగానికి చిహ్నం.!
అది ఏదో మామూలు నీలి రంగు
చక్రం కానే కాదు!
ఎంతో మంది ధన్య జీవులు, మానధనులు సాగించిన పోరాటానికి ఊపిరులూదిన
స్వేచ్ఛా వాయువుల చక్ర
భ్రమణం!
అది ఒట్టి వెదురు బొంగు
అనుకుంటున్నారా? కాదు.
భరత జాతి దాస్య శృంఖలాలు
తెంచడానికి ఆత్మ త్యాగం చేసిన వీరుల మేరునగ తుల్యమైన వెన్నెముక.!
ఇది మామూలు జెండా కాదు, కానే కాదు!
దీనికి పెట్టే దండం కేవలం
ఆ జెండాకు కాదు!
ఈ దేశానికి, దాస్య విముక్తికి ధారపోసిన అసువులకు, మహాత్ముల త్యాగానికి, మహామహుల ధైర్యానికి....
ఇది మనకు మనమే పెట్టుకునే
దండం.!
ఒక్క రోజైనా దండం పెట్టను
అనే వాళ్ళను ఏమనాలో
ఇప్పుడు చెప్పండి..... కృతఘ్నులే నా..???
14082022.... పరాశ్రీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి